Site icon Prime9

Telangana Legislative Council: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..!

Telangana Legislative Council

Telangana Legislative Council

New Elected Telangana MLC’s Oath Taking at Telangana Legislative Council: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నూతనంగా 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 8మందితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపా‌ల్‌రెడ్డి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజిరెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

ఏడుగురు ప్రమాణ స్వీకారం..
ఏడుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్‌ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు.

నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతా : అంజిరెడ్డి
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అధిష్ఠానానికి, గెలిపించిన ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గొంతు విప్పుతానని చెప్పారు. విద్యాసంస్థలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలని ప్రభుత్వం చూస్తోందని, విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం : మల్క కొమురయ్య
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడారు. తనను గెలిపించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని రుజువు అయిందన్నారు. కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version
Skip to toolbar