Site icon Prime9

CM Revanth Reddy : కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి.. మండలిలో సీఎం రేవంత్ ఆసక్తకిర వ్యాఖ్యలు

CM Revanth Reddy

CM Revanth Reddy : స్టేచర్‌పై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మండలిలో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

 

 

ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయడం లేదని, ప్రజల్లో అసలే ఉండటం లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించటం లేదని ఫైర్ అయ్యారు. అలాంటప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. కొవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం ఫెసిలిటీ ఉండేదని, ఇప్పుడు అది కూడా లేదన్నారు. రాజకీయాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం, వర్క్‌ ఫ్రమ్‌ ఫామ్‌‌హౌస్‌ వంటిది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కారణం బీఆర్ఎస్ అప్పులేనని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశామని, రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు.

 

 

ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో రైతులకు రుణమాఫీ చేయాలంటే ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఎగ్గొట్టారని సీఎం గుర్తుచేశారు. కేసీఆర్ మోసం చేశాడని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు.

Exit mobile version
Skip to toolbar