CLP Meeting with CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం (రేపు) కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ భేటీలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. భా భారతి పోర్టర్, ఎస్సీ వర్గీకరణ చట్టం, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ధరణి రద్దు చేసి భూ భారతిని ఈ రోజు నుంచి అమలులోకి తీసుకురాబోతున్నది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై ముఖ్యమంత్రి సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో తాజాగా మంత్ర వర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి డైరెక్షన్స్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.