BRS Working President KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. రాజేంద్రనగర్‌లో పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి గెలిస్తారని జోస్యం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలే నష్టపోయారని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాయమాటలకు వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారని తెలిపారు. మతం పేరు పలుకకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీ పార్టీకి ఉందా? అని సవాల్ విసిరారు. బీజేపీ ఆటలు ఇక ఎన్నో రోజులు సాగవని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అధికార కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
త్వరలోనే రాజేంద్రనగర్ ఉప ఎన్నిక..
త్వరలోనే రాజేంద్రనగర్‌కు ఉప ఎన్నికలు వస్తాయని, యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి గెలిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలే నష్టపోయారని పేర్కొన్నారు. గ్రేటర్‌లో అన్ని సీట్లు గెలిచామన్నారు. రేవంత్ మాయమాటలకు వృద్ధులు, మహిళలు , నిరుద్యోగులు ఎక్కువ మోసపోయారన్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో 420 హామీలు ఇప్పించారని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇద్దామని తెలంగాణ ప్రజలు ఓటు వేశారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కారు మంచి పనులు చేయరని దుయ్యబట్టారు. ఫ్రీ బస్ తప్ప ఏమీ చేయలేదని, దాని గురించి మాట్లాడితే మళ్లీ కేసులు పెడతారని తెలిపారు.
ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా?
మతం పేరు పలుకకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు ఇక సాగవన్నారు. చేవెళ్ల, రాజేంద్రనగర్లలో ఈ ఏడాది ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలు రావని చెప్పినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఇప్పటి నుంచే ప్రచారానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27 జరగబోయే వరంగల్ సభను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు బస్సుల్లో కార్యకర్తలతో కలిసి సభకు రావాలన్నారు. సబితా ఇంద్రారెడ్డి కూడా బస్సులోనే సభకు వస్తారని, 40వేల బస్సులు సభకు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.