Prime9

Crime : మేడిగడ్డలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

Jayashankar Bhupalpally District : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్‌ (13), సాగర్‌ (16), మధుసూదన్‌ (18), రాంచరణ్‌ (17), శివ మనోజ్‌ (15), రాహుల్‌ (19) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

శుభకార్యానికి వెళ్లి..
మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో రెండు రోజు క్రితం పెళ్లి జరిగింది. శుభకార్యానికి హాజరైన బంధువుల్లో 8 మంది శనివారం సాయంత్రం అంబట్‌పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు చేరుకున్నారు. స్నానం చేసేందుకని మొదట నదిలో దిగిన పట్టి మధుసూదన్‌ మునిగిపోతుండటాన్ని గమనించిన ఆయన సోదరుడు పట్టి శివమనోజ్‌ కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడు కూడా మునిగిపోయాడు. ఒకరి తర్వాత ఒకరుగా ఆరుగురు అదే ప్రాంతంలో గల్లంతయ్యారు.

 

బాధితుల్లో నలుగురు అంబట్‌పల్లికి చెందిన వారు కాగా, ఇద్దరు కొర్లకుంట గ్రామస్తులని బంధువులు తెలిపారు. ఆటోను నదికి దగ్గరలో నిలిపి వస్తున్న పట్టి వెంకటస్వామి కళ్లముందే ఇద్దరు కుమారులు మధుసూదన్, మనోజ్‌ గల్లంతవడంతో కుప్పకూలారు. గజ ఈతగాళ్ల సాయంతో ఆరుగురి మృతదేహాలను ఆదివారం మధ్యాహ్నం వెలికితీశారు.

Exit mobile version
Skip to toolbar