Site icon Prime9

Revanth Reddy : ఈ అభినందనలు నాకు కాదు.. రాహుల్ గాంధీకి అందాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy : బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమెదం తెలిపింది. దీంతో బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్ బీసీ సంఘాల నేతలతో మాట్లాడారు. ఈ అభినందనలు తనకు కాదని, రాహుల్ గాంధీకి అందాలన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ స్పష్టంగా చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులసర్వే నిర్వహించామన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలని స్పష్టం చేశారు. లెక్కలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందన్నారు. అందుకే తెలంగాణలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు.

 

అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ రోజుగా ప్రకటించుకున్నామన్నారు. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక సమయంలో కులసర్వే పూర్తిచేశామని స్పష్టం చేశారు. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించామన్నారు. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశామన్నారు. ఏ పరీక్షలోనైనా తాము చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలనేదే తమ ఆలోచన్నారు. దీన్ని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు. దీనని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని మరోసారి గుర్తుచేశారు.

 

కాంగ్రెస్‌లో అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది బీసీలే ఉన్నారని గుర్తుచేశారు. కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని అన్నారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌‌లో పడొద్దని బీసీ సంఘాలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సర్వేను తప్పుపడితే నష్టపోయేది బీసీలే అని స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar