Hyderabad: ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. అనుభవం ఉన్న సర్జన్‌తోనే 34 ఆపరేషన్లు చేశారని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అనుభవజ్ఞుడైన వైద్యుడి ఆధ్వర్యంలో ఆపరేషన్లు జరిగాయని చెప్పారు.
ఆపరేషన్ చేయించుకున్న వారంతా కొద్ది గంటలే ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని, ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడం, అలాగే ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది బాధాకరమైన విషయమన్నారు.