Folk Singer Sai Chand : ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబంతో కలిసి కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారని తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి ఫలించలేదన్నారు. ఇక తాజాగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా సాయి చంద్ అకాల మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదువుకున్న సాయిచంద్ విద్యార్థి దశ నుంచే కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. జానపద పాటలతోసాగే పలు టీవీ షోలలోనూ సాయిచంద్ సందడి చేశారు. 2021 డిసెంబర్ నెలలో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
జానపద గాయకుడిగా మంచి పేరు పొందిన సాయిచంద్.. విద్యార్ధి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో భాగం అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసుకునేందుకు తన వంతుగా గళమెత్తి ప్రజల్ని చైతన్యం చేసే యత్నం చేశారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో ఎక్కడ సభలు నిర్వహించినా.. తన గొంతుకను వినిపించేవారు. ఈ కారణంగానే సాయి చంద్‌కు బీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. చిన్నవయస్సులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ పలువురు నేతలు పేర్కొన్నారు. సాయిచంద్ భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు.
అలానే సాయిచంద్ మరణం పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సీఎంవో ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. ఆ పోస్ట్ లో.. “చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరం” అని సీఎం విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. పలువురు నేతలు, కళాకారులు, ఉద్యమకారుల సాయిచంద్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.. అని రాసుకొచ్చారు.