Telangana CM Revanth Reddy Inaugurates HCL Tech Cente In Madhapur: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ హైదరాబాద్ నగరంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్‌గా నిలిచామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈవీలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటిక్ వంటి రంగాల్లో పెట్టుబడులను చూసి హైదరాబాద్ ఈజ్ అన్‌స్టాపబుల్ అని అంతా అంటున్నారని పేర్కొన్నారు.
కాగా, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు.. హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండీ విజయ్ కుమార్ చర్చలు జరిపారు. హెచ్‌సీఎల్ టెక్ కొత్త సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ఇందులోభాగంగానే హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని సీఎం రేవంత్ ఆహ్వానించారు.
ఈ హెచ్‌సీఎల్ కొత్త సెంటర్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలు, క్లౌడ్, అర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్ వంటి సేవలు అందించనున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో దాదాపు 5వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 2007 నుంచి హెచ్‌సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లెయింట్లకు సేవలు అందిస్తోంది. కొత్త సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ మొత్తం 5 సెంటర్లను విస్తరించనుంది. ఈ కొత్త సెంటర్‌తో మరింత అత్యాధునిక సామర్థ్యం అందుబాటులోకి రానుంది.