Road Accidents: రాష్ట్రంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నడుంబిగించింది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. వాటితో సంభవించే మరణాలను తగ్గించే దిశగా సరికొత్త ప్రతిపాదనను తీసుకొస్తోంది. కాగా, కొత్తగా టూ వీలర్ కొనేటప్పుడు రెండు హెల్మెట్లు తీసుకొనేలా ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో జరిగే మొత్తం ప్రమాదాల్లో 53 శాతం టూ వీలర్ ప్రమాదాలే. ఈ ప్రమాదాలు, మరణాలను తగ్గిస్తే మంచి మార్పు కనిపిస్తుందని అధికారులు అనుకుంటున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్లు ధరించే విధంగా.. ప్రతి టూ వీటర్ వాహనదారుడికి రెండు హెల్మెట్లు ఉండాలనే నిబంధన అమలు చేసేలా భావిస్తున్నారు.
గంటకో ప్రమాదం(Road Accidents)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గంటకూ ఒక రోడ్డు ప్రమాద మరణం నమోదవుతోందని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో టూ వీలర్స్ ప్రమాదాలే ఎక్కువ. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం 21, 619 రోడ్డు ప్రమాదాలు జరగితే, అందులో 7559 మంది మృత్యువాతపడ్డారు. వీటిలో 10,653 ద్విచక్రవాహన ప్రమాదాలు కాగా.. 3977 చని పోయారు. ఈ ప్రమాదాల్లో తలకు బలమైన గాయం కావడమే అత్యధిక మరణాలకు కారణమని తేలింది. టూ వీలర్ నడిపేవారే కాకుండా వెనుక కూర్చున్న వారు ప్రమాదాలకు గురైనప్పుడు వారి తలకు గాయాలు కాకుండా కాపాడగలిగినపుడు మరణాల సంఖ్యను కూడా తగ్గించవచ్చు.
నిబంధన ఉన్నా..(Road Accidents)_
ఇప్పటికే వాహనం నడిపేవారితో పాటు.. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. కానీ ఇది అంతంత మాత్రంగానే అమలులో ఉంది. అసలు ప్రతి టూవీలర్ కు రెండు హెల్మెట్లు ఉంటే ఏదో విధంగా వెనక కూర్చున్న వాళ్లు కూడా వాడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. వాహనం కొనేటప్పుడే రెండు హెల్మెట్లు కూడా వినియోగదారుడు కొనేలా చూడాలని.. అవసరమైతే అందుకనుగుణంగా రోడ్డు రవాణా నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. పోలీసుశాఖలో రోడ్డు భద్రతా మండలి ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాటిని ప్రభుత్వానికి పంపనున్నారు.