Site icon Prime9

Ration Cards : ఏటీఎం కార్డుల రూపంలో రేష‌న్ కార్డులు.. ఎప్పుడు పంపిణీ అంటే?

Ration Cards

Ration Cards : ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రెండు కేటగిరీలుగా విభజించి కార్డులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కార్డుల జారీలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు (బీపీఎల్) కార్డులు, ఎగువన ఉన్న పేదలకు (ఏపీఎల్) కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న పేదలకు గ్రీన్ కలర్ కార్డులు, తెల్లకార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామని చెప్పారు.

 

క్యూ ఆర్ కోడ్‌లో కార్డులు..
తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. కొత్త కార్డులతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల ముద్రణ కోసం టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 25 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఈ నెల 26న సాంకేతిక, ఆర్థిక బిడ్‌లను తెరిచి, అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం 56 పేజీలతో కూడిన రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ను టెండర్‌ నోటీసుతోపాటు జత చేసింది.

 

ఏటీఎం కార్డు త‌ర‌హాలో..
కొత్తగా అందించనున్న రేషన్‌ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లో పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్‌ నోటీసులో వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ యజమాని పేరు మినహా ఎవరి ఫొటోలనూ పెట్టడం లేదు. 760 మైక్రాన్స్‌ మందం, 85.4మి.మీ పొడవు, 54మి.మీ వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్‌ కార్డు వివరాలను పొందుపర్చనున్నారు. దీన్ని ప్రకారం కొత్త రేషన్‌కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్‌, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనున్నారు.

 

కోటి 20 ల‌క్ష‌ల కార్డులు..
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కోటి, దారిద్య్ర రేఖకు ఎగువన పేదలకు 20 లక్షల చొప్పున మొత్తం 1.20కోట్ల రేషన్‌ కార్డుల ముద్రణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేండ్లపాటు ఒప్పందం అమలులో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తాము చెల్లిస్తామని టెండరు నోటీసులో పౌరసరఫరాల శాఖ తెలిపింది. బోగస్‌, నకిలీ కార్డులకు చెక్‌ పెట్టేందుకే క్యూ ఆర్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది. క్యూఆర్‌ కోడ్‌తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్‌ కోడ్‌ను జనరేట్‌ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి.

Exit mobile version
Skip to toolbar