Rain in Telangana : రాష్ట్రంలో పలు చోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. హైదరాబాద్‌పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికోడుతోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఊరట లభించింది.
నగరంలో మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో వాన పడే అవకాశం ఉంది. నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
ఆరెంజ్ అలర్ట్..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాగా, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.