Site icon Prime9

Niranjan Reddy: ఒక్క గుంట భూమి ఎక్కువున్నా నా పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

niranjan reddy

niranjan reddy

Niranjan Reddy: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు.. మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాలను మంత్రి కబ్జా చేశారని మీడియాకు వివరించారు. రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. ఇది అబద్ధం అని తేలితే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

రఘునందన్ రావు ఏమన్నారంటే.. (Niranjan Reddy)

రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు పాల్పడుతున్నారని రఘునందన్ రావు మీడియాకు వివరించారు. ప్రభుత్వ భూములు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్‌ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తరహాలోనే తాము కట్టుకోవద్దా అని మంత్రులు కూడా ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారన్నారని విమర్శించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మొత్తం మూడు ఫామ్‌హౌస్‌లు కట్టినట్లు ఆరోపించారు. చండూరులో 165 ఎకరాల స్థలంలో ఫామ్‌హౌస్‌ నిర్మించారు. గిరిజనుల పేరిట సబ్సిడీ పేరుతో భూములను మాయం చేసినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని మీడియాకు వెల్లడించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు తమకు నచ్చిన విధంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు.

స్పందించిన నిరంజన్ రెడ్డి..

రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేకనే ఇలా అబద్ధాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు పాల్పడలేదని మంత్రి అన్నారు.

తమ స్వగ్రామం పాన్ గల్ లో తనకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవేనని అన్నారు.

ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో నిర్మించుకున్న ఇల్లు అని పేర్కొన్నారు.

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

రఘునందన్ రావు చేసిన ఆరోపణలు నిజమైతే.. తన పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు.

ఒకవేళ ఇది తప్పుడు ప్రచారమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

దురుద్దేశపూర్వక చేసిన ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. మూడు ఫాంహౌజ్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకమని పేర్కొన్నారు.

పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని మంత్రి ఎద్దేవా చేశారు.

Exit mobile version