Site icon Prime9

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

MLC Election Campaign Ends in AP and Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నెల 11న నామినేషన్ల పరిశీలించారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 15 రోజుల పాటు కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, కూటమి, స్వతంత్ర అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు.

ఈ నెల 27న పోలింగ్..
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4:00 వరకు జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగనుంది. వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గ పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రకారం.. కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లు 3,41,313గా, టీచర్లు 25,921 ఓటర్లుగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది ఉండగా.. ముగ్గురు థర్డ్ జెండర్లు ఉన్నారు. అలాగే ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు. దీంతో పట్టభద్రులకు సంబంధించి 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

పోటాపోటీగా ప్ర‌చారం..
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం ఇప్పటికే అన్నివర్గాల వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఏపీటీఎఫ్ నాయకుడు పాకలపాటి రఘువర్మ పోటీలో ఉన్నారు. పీఆర్టీయూ తరఫున మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని, దీంతో వర్మ గెలుపును ఆపలేరని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కూటమికే సీపీఐ మ‌ద్ద‌తు..
ఈ ఎన్నిక‌ల్లో కలిసి పోటీ చేయాలన్న సీపీఐ ప్రతిపాదనను సీపీఎం రిజెక్ట్ చేసింది. దీంతో అనధికారికంగా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సీపీఐ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో 35 మంది బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 10 మంది పోటీ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar