MLA Rajaiah:స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళ సర్పంచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మీడియాతో మాట్లాడారు.
మహిళలను వేధిస్తే సహించేది లేదు.. (MLA Rajaiah)
ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడారు. తాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవం అని.. మహిళలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అన్యాయాలు, అరాచకాలను మహిళలు సహించవద్దని సూచించారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తానని.. ఆయన వల్లే సర్పంచ్ అయ్యానని నవ్య అన్నారు. పార్టీని ఒక కుటుంబంలా భావిస్తానని.. జరిగిన విషయాన్ని మరిచిపోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చాలామంది మహిళలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి వెళుతున్నారని.. మీరూ వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయని ఓ మహిళ ప్రలోభ పెట్టినట్లు నవ్య తెలిపారు. సమయం వచ్చినపుడు అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయానని.. నా మీద కోరికతో, నేనంటే ఇష్టంతో పార్టీ టికెట్ ఇచ్చాననడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు.
క్షమాపణ కోరిన ఎమ్మెల్యే..
ఈ వ్యవహారం మరింత ముదరడంతో సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే వెళ్లారు. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. జరిగిన జరిగిన పరిణామాలకు క్షమాపణ కోరుతున్నట్లు రాజయ్య తెలిపారు. ప్రవీణ్‌పై అభిమానంతోనే ఆయన భార్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చినట్లు రాజయ్య తెలిపారు. జానకిపురం గ్రామా అభివృద్ధికి రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.