Minister Ktr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలవడం లేదని, ప్రజా దర్బార్ నిర్వహించటం లేదని వస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉద్యోగ వ్యవస్థ, ప్రజాప్రతినిధులు విఫలైనపుడు సమస్య తన వరకు వస్తుందని ముఖ్యమంత్రి అన్నట్టు కేటీఆర్ చెప్పారు. అందుకోసమే తెలంగాణలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చి, ప్రజల వద్దకు పాలనను చేర్చారని తెలిపారు. ఇక ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయని కేసీఆర్‌తో చెబితే..
‘రాష్ట్రంలో సీఎం దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగి వరకు ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సామాన్య వ్యక్తి పింఛను, రేషన్ కార్డు, నల్లా కోసమో, పాస్‌బుక్‌లో పేరు ఎక్కట్లలేదనో సీఎంకు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందంటే వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది. యంత్రాంగం సరిగా పని చేయడం లేదని నాకు అర్థమవుతోంది. సామాన్యులకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి. వీరితో నెరవేరని సమస్యలు, కష్టమైనవి ఏమైనా ఉంటే సీఎం వరకు రావాలి. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఎవరి స్థాయిలో వాళ్లు ఉండి పనిచేస్తే ముఖ్యమంత్రి వరకు రావాల్సిన అవసరం లేదన్నారు’ అని కేటీఆర్ తెలిపారు.
ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. వార్డు కార్యాలయానికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ప్రజలకు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవం రోజు 150 ప్రాంతాల్లో ఒకేసారి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. వార్డు అధికారుల జాబ్ చార్ట్‌తో పాటు ప్రజల ఫిర్యాదులను ఎంతకాలంలో పరిష్కరిస్తామో చెప్పే సిటిజన్ చార్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి వార్డు కార్యాలయ వ్యవస్థ లేదని ఇదే ప్రథమమని చెప్పారు.