Chiranjeevi Released Mark Shankar Health Update: పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సింగపూర్ ఆసుపత్రిలో వైద్యులు శంకర్‌కు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో శంకర్‌తోపాటు మరో 15 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పవన్‌కు సీఎం చంద్రబాబు ఫోన్..
ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ డాక్టర్లతో పవన్, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
త్వరగా కోలుకోవాలి: జగన్
అగ్నిప్రమాదంలో పవన్ కొడుకు మార్క్ శంకర్ గాయపడటం పట్ల ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ చిన్న కుమారుడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే షాక్ అయినట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు.
మంత్రి నారా లోకేష్ ఆరా..
పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన తెలిసిన వెంటనే షాక్ అయ్యానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్, విద్యార్థులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి ప్రార్థనలు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తునట్లు ట్విట్ చేశారు.