Site icon Prime9

KCR: రాష్ట్రంలో ఉప ఎన్నికలు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR Key Comments On MLAs Who Changed Parties: తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నిక తప్పదని, ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్‌లో సీఎం కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

నేతల చేరిక..
కాగా, మంగళవారం తాడికొండ రాజయ్య నాయకత్వంలో స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు కేసీఆర్ చేతుల మీదగా బీఆర్ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని అన్నట్లు సమాచారం.

ఘన్‌పూర్‌లో మార్పు తథ్యమా?
2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటంతో పలువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరితోపాటు ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడియం కావ్యకు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు.

18 న క్లారిటీ..
కాగా, ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన మూడు పిటిషన్‌ల మీద ఈనెల 18న విచారణ ముగియనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అది తమకు ప్లస్ అవుతుందని గులాబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version
Skip to toolbar