Rain : కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఇవాళ హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్‌నగర్, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, విద్యానగర్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ఓ హోటల్ వద్ద కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.
పలు ప్రాంతాలు జలమయం..
అకాల వానతో హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సచివాలయం ముందుభాగం చెరువును తలపిస్తోంది. చార్మినార్‌లోని ఓ మీనార్‌పై నుంచి కొంత మట్టి కిందపడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. వివిధ చోట్ల రోడ్లపై వర్షపు నీళ్లు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మలక్‌పేట వంతెన వద్ద వరద నిలిచిపోయింది. రాజ్‌భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరింది.
అలర్ట్‌గా ఉండండి.. జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
హైదరాబాద్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6 జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎర్రమంజిల్ ప్రాంతంలో చెట్టు కూలడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ ఐఆర్టీ టీమ్స్ క్లియర్ చేస్తుందని పేర్కొన్నారు. సచివాలయం, రాజ్‌భవన్ రోడ్డు, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతోపాటు నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు.
వర్షంతో రోడ్లపై ట్రాఫిక్ ఏర్పడిందని, అరగంట లోపు వాటర్ క్లియర్ చేస్తామని అధికారులు తెలిపారు. డ్రైనేజీ పొంగిపొర్లకుండా జెట్టింగ్ మిషన్స్ ద్వారా అరికడుతున్నాయి. పోలీస్, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.