Rain Alert to Telangana Districts: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరోవైపు ఎండల నుంచి రక్షణ కోసం శీతల పానీయాలు, కొబ్బరి బోండలను ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో వాటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో కలిసి మధ్య కోస్తా తీరం వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది వ్యాపించి ఉందని వివరించింది.
ఇక ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది.