High Temperatures: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వనున్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఏప్రిల్ 3 వరకు ఎండలు పెరుగుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల వరకు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే , ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మొన్నటి వరకు వర్షాలు పడుతూ.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా… గత నాలుగు రోజుల నుంచి ఎండలు ఒక్కసారిగా పెరిగాయి.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలో గురువారం రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రత(43.8 డిగ్రీలు) నమోదు అయ్యింది. అదే విధంగా అదిలాబాద్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి, కుమురం భీం, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, జగిత్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణ శాఖ కూడా అలెర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలోని 7 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. శుక్రవారం నుంచి ఏప్రిల్ 3 వ తేదీ వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ- గద్వాల, నాగర్ కర్నూల్, అదిలాబాద్, కుమురంభీం, నారాయణ పేట జిల్లాలకు ఆరెంట్ అలెర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈ జిల్లాలోని వాతావరణాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసింది.