TSPSC: టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డిని 2021లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నియమించింది.
సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..(TSPSC)
జనార్ధన్ రెడ్డి రాజీనామాకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్‌కు అన్ని వివరాలు పంపించామని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో రివ్యూ నిర్వహించనున్నారు. బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే ఛైర్మెన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా మిగిలిన బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోపక్క జనార్దన్ రెడ్డి రాజీనామాతో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డు ప్రక్షాళన తరువాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.