Site icon Prime9

Harish Rao : సీఎం రేవంత్ మాట నిలబెట్టుకోవాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు

Harish Rao

Harish Rao

Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవం‌త్‌రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

 

 

రైతులకు చేదు అనుభవం మిగిల్చింది..
గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారని, ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మార్చి 31 కల్లా రైతులకు రైతుభరోసా అందజేస్తామని హామీనిచ్చారని, కానీ ఏప్రిల్ 1వ తేదీ వచ్చినా నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని మండిపడ్డారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రైతులు రైతుభరోసా నిధుల కోసం ఎదురుచూశారని, అయితే వారికి ప్రభుత్వం చేదు అనుభవం మిగిల్చిందని ఫైర్ అయ్యారు. దసరా పండుగకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, సంక్రాంతికి అందిస్తామన్నా నిధులు రాలేదని మందిపడ్డారు. ఉగాది నాటికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం బాధాకరమన్నారు. క్యాలెండర్ మారుతున్నా రేవంత్ మాట మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.

 

 

కోతల సమయం వచ్చినా రైతుభరోసా అందించలేదు..
నాట్ల సీజన్‌లో గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకం కింద డబ్బులలు ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. కానీ రేవంత్ కోతల సమయం వచ్చినా రైతుభరోసా పథకం కింద డబ్బులు అందించలేకపోయారని ఆరోపించారు. మోసపూరిత పాలననే విధానంగా మార్చుకున్న రేవంత్‌రెడ్డి రైతులను అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ హామీ ఇంకా నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ భరోసా పథకం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే రైతు భరోసా నిధులు అందించే వరకు బీఆర్ఎస్ రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar