Drunk And Drive : ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఒక్కోసారి దారి తప్పుతున్న ఘటనలను ఇటీవల ఎక్కువగా గమనించవచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెప్పే పోలీసులు.. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా ఇప్పటికే సీఐ శ్రీనివాస్ వాహనంపై ఇప్పటికే ఆరు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. ఇక, సీఐ శ్రీనివాస్ మద్యం సేవించి కారు నడుపారన్న నేపథ్యంలో డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులో రీడింగ్ 200 దాటినట్టు తెలుస్తోంది.
బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ శ్రీనివాస్ ఫుల్లుగా మద్యం సేవించి కారును నడిపారు. ఈ క్రమంలో ఎదురుగా కూరగాయల లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, వాహనం నడుపుతున్న శ్రీధర్.. వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. కాగా సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సిసీ టీవి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.