Telangana Deputy CM Bhatti Vikramarka ordered withdraw the cases on HCU students: హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజాసంఘాల ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ప్రజాసంఘాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌సీయూలో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని, నిషేధాజ్ఞలు తొలగించాలని, అరెస్టు అయిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు మంత్రుల కమిటీ ముందు ఉంచారు. విద్యార్థుల కేసులపై సానుభూతితో సమీక్షిస్తామని మంత్రుల కమిటీ హామీనిచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కంచ గచ్చిబౌలి భూమిలో బందోబస్తు కొనసాగుతుందని వెల్లడించారు. 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవవైవిధ్య సర్వేకు అనుమతి కోరగా, కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని తెలియజేశారు. భూముల వివాదంలో ఇద్దరు విద్యార్థులు అరెస్టు కాగా, వారు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భట్టి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మిగతా విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పేర్కొన్నారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.