CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త. జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క – సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు నేను వస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
వరంగల్ పర్యటనలో భాగంగా కాలేజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు కాళోజి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కాళోజి నారాయణరావు జీవిత చరిత్రపై తీసిన డాక్యుమెంటరీ, గ్యాలరీలను సీఎం రేవంత్ రెడ్డి వీక్షించనున్నారు. అక్కడి నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. వరంగల్ సెంటిమెంట్‌తో నిర్వహిస్తున్న తొలి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా, వరంగల్‌కు ఎన్నడూ లేని విధంగా వరాల జల్లు కురిపించారు. దాదాపు రూ.4,967.47 కోట్లు కేటాయించారు.