CM Revanth Reddy : కేసీఆర్‌కు, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలిసి త్వరలో ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ శాసనసభలో బీసీ బిల్లుపై మాట్లాడారు. బిల్లుకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతోపాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని పోతామని చెప్పారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని సభా నాయకుడిగా మాటిస్తున్నానని చెప్పారు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున చట్ట సవరణ కోసం ప్రధాని మోదీని, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అందరం కలిసికట్టుగా కలుద్దామని సూచించారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌దేనన్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాయాలని సీఎస్‌కు ఆదేశాలిస్తున్నానని చెప్పారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అంశంలో మనందరి అభిప్రాయాలు ఒక్కటే అయినప్పుడు ఒకరినొకరు విభేదించుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించామని, ఆ ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు బీసీ కులగణన చేశామని తెలిపారు.