Site icon Prime9

CM Revanth Reddy: ప్రత్యేక పోర్టల్.. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక

CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంత‌టి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్‌లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమ‌వారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆ బాధ్యత హైడ్రాకే
ఈ క్ర‌మంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను నిరోధించే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

నిఘా పెరగాలి..
ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని సూచించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు, 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలి.

Exit mobile version
Skip to toolbar