Site icon Prime9

CM KCR: మోటార్లకు కాదు.. బీజేపీకే మీటర్లు పెట్టాలి.. సీఎం కేసీఆర్

Munugode: మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. క్రిష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా మునుగోడు ఎందుకు వస్తున్నారో అమిత్ షా చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏమిటో అమిత్‌షా రేపు మునుగోడు సభలో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఫ్లోరైడ్ సమస్యతో నల్గొండ జిల్లా సతమతమైందని కేసీఆర్ అన్నారు. ఆనాడు ప్రజల గోడును ఎవరూ పట్టించుకోలేదని, ఫ్లోరైడ్ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఫ్లోరైడ్ సమస్యను అధిగమించామన్నారు. ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు విడిపోతే పంచుకోరా? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు అవుతోంది. అయ్యా, ఈ కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని అడిగితే సమాధానం చెప్పరు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అమిత్ షా? సమాధానం చెప్పు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశాం. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతాం. ఇలాంటి బొమ్మలు కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు? సమాధానం చెప్పు అని అమిత్‌షాను కేసీఆర్ ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అయింది. రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, కార్మికులకు కానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా, వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా? అవి లేవుకానీ, ఎయిర్‌పోర్టులు, విమానాలు, బ్యాంకులు, రైళ్లు, రోడ్లు, గ్యాస్ కంపెనీలు అన్ని వరుసపెట్టి అమ్మడం మొదలు పెట్టారు.ఇక మిగిలింది ఏంటి? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. దీని గురించి మునుగోడు ప్రజలు ఆలోచించాలి. బావి దగ్గర మీటర్ పెట్టు కేసీఆర్ పెడతావా? పెట్టవా? అని నన్ను అడిగారు. నేను చచ్చినా పెట్టను అని తేల్చిచెప్పానని కేసీఆర్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్‌కు మద్దతివ్వడంపై సీసీఐకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు రాగానే ఎవరూ ఆగం కావొద్దన్నారు. క్రియాశీలక శక్తులన్నీ ఏకమై దుర్మార్గుల ఆట కట్టించాలన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక మామూలుది కాదని, మన జీవితాల ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రలోభాలకు లొంగి జీవితాలను పోగొట్టుకోవద్దని సూచించారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడితే మోటార్లకు మీటర్లు పెడుతుందన్నారు. మీటర్లు పెట్టే బీజేపీ కావాలా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కావాలా, ప్రజలు తేల్చుకోవాలన్నారు. మోటార్లకు కాదు. బీజేపీకే మీటర్లు పెట్టాలన్నారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Exit mobile version