CM Revanth Reddy : ఉమ్మడి వరంగల్ తనకు ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచే ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. వరంగల్‌కు విమానాశ్రయం తీసుకొస్తానని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సాధించామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును ప్రభుత్వానికి అప్పగించిపోయారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఒక్క సంవత్సరంలోనే తమ ప్రభుత్వం రూ.84వేల కోట్లు వడ్డీ, రూ.64 వేల కోట్లు అసలు చెల్లించిందని వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఇందుకోసం రూ.5,500 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కింద రూ.7,200 కోట్లు ఇచ్చామని, గ్రూపు 1,2,3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవసరం ఉందని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్న వ్యక్తి తన బాధ్యతలను నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. 15 నెలలుగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి మాత్రం రావటం లేదన్నారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే వ్యక్తి వారి కోసం అసెంబ్లీలో సూచనలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్‌కు విమానాశ్రయం, రింగురోడ్డు వచ్చాయన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. జయశంకర్ సార్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ చేసిన తప్పులన్నీ బయటపెడతామన్నారు.
అసెంబ్లీలో ప్రజల గురించి కేసీఆర్ ఒక్క మాటా మాట్లాడలేదు : మంత్రి పొంగులేటి
కేసీఆర్ తెలంగాణను రూ.8లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, ఆయన కుటుంబం దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి తమ ఖాతాల్లో వేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ 15 నెలల్లో రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన సభాపతి పట్ల సభలోనే అమర్యాదగా ప్రవర్తించారని మండిపడ్డారు. సభలో నిజాలు వినాల్సి వస్తుందని కేటీఆర్, హరీశ్‌రావు వాకౌట్ చేసి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఇంకా బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
పదేళ్లలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు అనుమతి సాధించని నేతలు ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మూడేళ్లకే కూలిపోయిన కాళేశ్వరాన్ని నిర్మించి ఏడో వింత అని గొప్పలు చెప్పుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణకు అన్యాయం చేశారని పొంగులేటి ఆరోపించారు.