Site icon Prime9

KTR : అధికారంలోకి వస్తాం.. అతిచేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR

KTR

BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

 

రజతోత్సవ సభకు విరాళం..
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన కొందరు మహిళలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. లగచర్ల భూసేకరణలో భాగంగా మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. బాధ్యులైన పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి..
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ మహిళా కమిషన్లను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుబట్టిందని చెప్పారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక తర్వాత అయినా రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

 

భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలి..
ఎన్‌హెచ్ఆర్‌సీ సూచించిన విధంగా ఆరు వారాల్లో చర్యలు తీసుకోకపోతే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. లగచర్లలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించినప్పటికీ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar