Site icon Prime9

BRS Working President KTR : కేటీఆర్‌ కీలక ప్రకటన.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

KTR

KTR

BRS Working President KTR : హైదరాబాద్‌ నగరంలోని కాలనీలు, బస్తీల్లో గులాబీ జెండా ఎగురవేసి, ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు.

 

కౌన్సిలర్లకు విప్‌ జారీ చేస్తా..
జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తామని కీలక ప్రకటన చేశారు. కౌన్సిలర్లకు విప్‌ జారీ చేస్తామన్నారు. ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. 2017 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు 99 గెలిచి పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో క్లీన్‌ స్వీప్‌ చేశామన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్‌ఆర్‌ లోపల గులాబీ జెండా ఎగిరేసిందన్నారు. హైదరాబాద్‌ ప్రజల ముందు కాంగ్రెస్‌, బీజేపీ మాయమాటలు, దొంగనాటకాలు పనిచేయవని స్పష్టం చేశారు.

 

హైడ్రా పేరుతో అరాచకం..
హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అరాచకం సృష్టించారన్నారు. రేవంత్ అన్న ఇంటిని కూల్చలేదని, ధనవంతుల ఇళ్లను కూడా ముట్టుకోలేదని తెలిపారు. కోర్టుకు సెలవు చూసుకుని హైడ్రా పేదల ఇండ్లను కూల్చివేసిందని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా హైడ్రా తన పనితీరు మార్చుకోలేదన్నారు. హైడ్రా దెబ్బ, ముఖ్యమంత్రి రేవంత్‌ చేతగానితనానికి నగరంలో రియల్‌ ఎస్టేట్‌ పతనమైందని తెలిపారు. హైదరాబాద్‌లో లక్ష మంది ఉపాధి కోల్పోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవా?
రెక్కాడితే గాని డొక్కాడని పేదల కడుపు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొట్టిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని సీఎం అంటున్నారని, లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారని మండిపడ్డారు. మూసీతో మురిసే రైతులు ఎంతమంది. వచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను కట్టామని, మూసీలోకి వ్యర్థాలు వెళ్లకుండా చేశామని గుర్తుచేశారు. మూసీ కోసం ఇండ్లను కోల్పోయిన వారు బూతులు తిడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar