Site icon Prime9

BRS Working President KTR : కేటీఆర్ సంచలన పోస్ట్.. కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం విచారణ చేపట్టాలి

KTR

KTR

BRS Working President KTR : కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాలని కోరారు. ఆ 400 ఎకరాల భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మాట్లాడింది బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం..
యూనివర్సిటీలో జరిగిన వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసమని ఆరోపించారు. కాంగ్రెస్‌ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశామన్నారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్లు కేంద్ర సాధికార కమిటీ కూడా నిర్ధారించిందన్నారు. స్వతంత్ర విచారణ చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించిందన్నారు. ఆర్థిక అక్రమాలపై వెంటనే కేంద్రం విచారణ చేపట్టాలని కోరారు.

 

రెండు పార్టీలు ఒక్కటి కాదని నిరూపించుకోవాలి..
నగరాలు వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పేర్కొన్నారు. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్‌ లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని దుయ్యబట్టారు. కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని మరోసారి కోరారు. ప్రధానిగా మోదీ పర్యావరణ పరిరక్షణ, నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar