Site icon Prime9

KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక భేటీ

KCR

KCR

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంమఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగింది. సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.

 

 

 

సమాయత్తం కావాలని పిలుపు..
సభను ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గాల వారీగా నేతలు ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సభలో పాల్గొనే ప్రజల సంఖ్యపై ప్రత్యేక దృష్టి సారించాలని నేతలకు సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష మంది ప్రజలను సభకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముందస్తు సమావేశాలను ఏర్పాటు చేసి, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.

 

 

 

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది పలికేలా..
సభ ద్వారా బీఆర్ఎస్ తన బలాన్ని మరోసారి ప్రదర్శించనుంది. ప్రజల్లో పార్టీకి మద్దతును పెంచుకునేలా సభను నిర్వహించాలని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందనే అంశాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం ఇవ్వాలని నిర్ణయించారు. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని నేతలు హామీనిచ్చారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని కేసీఆర్‌కు వెల్లడించారు. సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది పలికేలా సభ నిలిచిపోతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతున్నాయి.

Exit mobile version
Skip to toolbar