Site icon Prime9

Bhatti Vikramarka : అబద్ధాల మీదే బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

 

 

 

అబద్ధపు ప్రచారం..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను లాక్కొని ప్రభుత్వం వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో 400 ఎకరాలను యూనివర్సిటీ నుంచి తీసుకొని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించారని గుర్తుచేశారు. 400 ఎకరాలకు బదలాయింపుగా యూనివర్సిటీకి ఆనుకొని మరోవైపు ఉన్న 397 ఎకరాలు హెచ్‌సీయూకు కేటాయించారన్నారు. ఆనాడు రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ యాజమాన్యం కలిసి సంతకం చేసిన రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డులకు సంబంధించిన పత్రాలను మీడియాకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజలు, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు.

 

 

 

హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచాం..
ప్రజలకే దక్కాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపును రద్దు చేసిందన్నారు. తమకు ఇప్పటికే గత ప్రభుత్వం రాసి ఇచ్చిందన్నారు. ఇప్పుడు మీరు రద్దు చేస్తే ఎలా అని సంస్థ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిందన్నారు. ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలనే నిర్ణయంతో ఆనాటి నుంచి పోరాడుతూ వస్తున్నామని చెప్పారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ భూములను వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికే చెందేలా పోరాటం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచామన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తిని తిరిగి తెచ్చుకున్నామన్నారు. తర్వాతే టీజీఐఐసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసిందని, ఇది అభినందించాల్సిన విషయమన్నారు.

 

 

 

400 ఎకరాలు సాధించడం ఈ ప్రభుత్వ విజయం..
400 ఎకరాలను కాపాడి, ఉద్యోగావకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని చెప్పారు. హైటెక్‌ సిటీ, హైటెక్‌ సిటీ ఫేజ్‌-2, నాలెజ్డ్‌ సిటీ వంటి వాటి ద్వారానే ఉపాధి పెరిగిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అప్పట్లో భూములను గాలికొదిలేశారని, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలని, సంపద సృష్టించి ఉపాధి పెరగాలన్నారు. తాము పట్టించుకోకపోతే ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేదన్నారు. 400 ఎకరాలు సాధించడం ఈ ప్రభుత్వ విజయమని, రాష్ట్ర ప్రజల విజయమని భట్టి పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar