Asaduddin Owaisi Comments on Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఉగ్రదాడిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన ఈ పర్యటక ప్రాంతానికి వేలమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇంత పెద్ద పర్యటక ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన కనీసం ఒక్క సిబ్బంది, సీఆర్పీఎఫ్ శిబిరం ఎందుకు లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు.
అలాగే, ఉగ్రదాడి జరిగిన ఈ ప్రాంతానికి చేరుకునేందుకు క్విక్ రియాక్షన్ టీం గంటకుపైగా సమయం పట్టిందన్నారు. ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని, ఈ దాడికి ఆ దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులే పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. అయితే భారత్ సరిహద్దును ఆ దేశ ఉగ్రవాదులు ఎలా దాటినట్లు అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారని, ఎవరిని బాధ్యులు చేయాలని అడిగారు. అనంతరం ఉగ్రదాడిని ఖండించారు.
కాగా, ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అఖిలపక్షం భేటీ జరిగింది. ఈ భేటీపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించాడు. అఖిలపక్ష భేటీని ఉద్ధేశించి కిరన్ రిజిజుతో మాట్లాడినట్లు తెలిపారు. 5 నుంచి 10 మంది ఎంపీలు ఉన్న పార్టీలతో భేటీ యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. ఇది జాతీయ సమస్య అని.. రాజకీయ అంశం కాదని పేర్కొన్నారు. అందుకే నిజమైన అఖిలపక్ష భేటీ నిర్వహించాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ భేటీ జరగాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు అసదుద్దీన్ అన్నారు.