Road accident : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని దంపతులు, 8 ఏళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితిక (8)గా గుర్తించారు.
ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు, కారు వేగంగా వచ్చి, మలుపు తీసుకొనే క్రమంలో కారు అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారు వెనుక భాగంలో కూర్చొన్న రేణుక, రితిక, డ్రైవర్ పక్కన కూర్చొన్న రవీందర్ అక్కడికక్కడే మృతిచెందారు. కారు వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందా? బస్సు వేగంగా రావడం వల్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.