Site icon Prime9

9th Nizam Nawab: 9వ నిజాంగా బాధ్యతలు చేపట్టిన నవాబ్ రౌనక్ యార్ ఖాన్

9th Nizam Nawab

9th Nizam Nawab

9th Nizam Nawab: నిజాంల ఆసిఫ్ జాహీ రాజవంశానికి 9వ అధిపతిగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్​ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ 57వ వర్ధంతి సందర్బంగా నజ్రీ బాగ్ ప్యాలెస్ సమీపంలోని కింగ్ కోటి వద్ద ఉన్నసమాధిని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 7వ నిజాం కుటుంబ సభ్యులందరి సమాధులు కలిగి ఉన్న మస్జిద్ ఎ జూడీని నవాబ్ రౌనక్ యార్ ఖాన్ సందర్శించి నివాళులర్పించారు. అసఫ్ జాహీ రాజవంశం కుటుంబ సభ్యులు సహచరులు కూడా కింగ్ కోఠిలోని మసీదు జోడిని సందర్శించి ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇకపోతే విదేశాల్లో ఉంటున్న నిజాం వారసులను కాకుండా స్థానికంగా ఉంటూ తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ అందరికీ చేతోడువాదోడుగా కలిసిపోతున్న రౌనఖ్ యార్ ఖాన్‌ను తమ కుటుంబ పెద్దగా ఇంతకు ముందే నవాబ్ వంశస్థులు ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా సంప్రదాయం ప్రకారం వివిధ తంతులు పూర్తి చేసి బాధ్యతలు స్వీకరించారు నవాబ్ రౌనఖ్. తొమ్మిదో నిజాంగా బాధ్యతలు చేపట్టిన రౌనఖ్‌ యార్‌ ఖాన్‌కు నిజాం వంశస్తులు వారి వంశపారంపర్యంగా వస్తూ ఇప్పటివరకు భద్రంగా ఉంచిన మూడు చేతి కర్రలను అందించారు.

ఆ మూడు చేతికర్రల్లో ఒకటి మొదటి నిజాం ప్రత్యేకంగా తయారుచేయించుకున్నారు. నాణ్యమైన చెక్కతో ఫిరోజ్‌ హుస్సేనీ డైమండ్‌ పొదిగిన ఈ చేతి కర్ర విలువ ఇప్పుడు సుమారు రూ.30 లక్షల దాకా ఉంటుంది. పైభాగంలో గుండ్రని నోబ్‌ కలిగి చుట్టూరా 5 బ్రాస్‌ లైన్లతో ఆ చేతికర్ర ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటుంది. మరొకటి టిప్పు సుల్తాన్‌ నుంచి నిజాం రాజులుకు దక్కింది. రోజ్‌ వుడ్‌తో వివిధ రకాల డిజైన్లతో దీనిని అప్పట్లో తయారుచేశారు. దాని విలువ కూడా సుమారు రూ. 30 లక్షల దాకా ఉంటుందని రాజవంశం ప్రతినిధులు వివరించారు. ఇంకో చేతికర్ర తాజ్‌మహల్‌ సృష్టికర్త షాజహాన్‌ నుంచి నిజాం నవాబులు పొందారని చరిత్ర చెప్తుంది. దానిని ఏనుగు దంతంతో తయారు చేశారు. ఈ పురాతన చేతి కర్ర రేటు కూడా సుమారు రూ.15 లక్షలు ఉంటుందని సొసైటీ ప్రతినిధులు చెప్పారు.

Exit mobile version