Women’s Groups to Provide Buses to RTC: మహిళలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని పేదింటి మహిళలకు అద్దె బస్సులు కేటాయించనుంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దెబస్సులు కేటాయించనుంది. అలాగే ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద రూ.77,220 చెల్లించనుంది.
అంతేకాకుండా బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడపనున్నాయి. మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే అదే రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎంతోపాటు కేబినెట్ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ బస్సులను మహిళా సంఘాలకు అందజేయనున్నారు.
అలాగే మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సు లను కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. తాజాగా, మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడం.. తెలంగాణ మహిళలకు వరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.