Site icon Prime9

Telangana Assembly: రెండోరోజూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్పులపై రగడ!

Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు.

 

రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన జరిగిందని, కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. కులగణనపై అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి అన్ని పథకాలు ఆపేసిందని, కానీ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు వేగంగా ముందుకెళ్తున్నాయన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఆది శ్రీనివాస్ వివరించారు.

 

అనంతరం కమీషన్ అంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కమీషన్ కాకతీయ, కమీషన్ భగీరథ్ అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నలుగురి వల్ల రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. ఇదిలా ఉండగా, 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని, ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందో? అని జగదీష్ రెడ్డి విమర్శించారు. అలాగే రైతుల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు. అధికార పార్టీ నేతలు రన్నింగ్ కామెంట్రీ ఆపి, మూసుకుని కూర్చోవాలన్నారు.

 

రుణమాఫీ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. వరికి రూ.500 బోనస్ ఇచ్చారా అని జగదీశ్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నలు వేశారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు వచ్చినట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ వివరంగా ఉన్నాయని, గవర్నర్‌కు గౌరవం ఇవ్వాలని చెప్పారు.

 

కాగా, గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని స్పీకర్ చెప్పడంపై జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులు కూడా గవర్నర్ ప్రసంగంపైనా మాట్లాడారా? అని తలసాని ప్రశ్నించారు. అలాగే అంశాన్ని తప్పుదారి పట్టించింది మేము కాదు.. కాంగ్రెస్సేనని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఎవరు తప్పుదారి పట్టించారో తేల్చాలన్నారు. సభలో ఉండమంటే ఉంటా.. వెళ్లమంటే వెళ్తానని జగదీశ్ రెడ్డి అన్నారు.

 

ఈ విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావొద్దన్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించొద్దన్నారు. కాగా, సభా సంప్రదాయాలకు ఏది విరుద్దమో చెప్పాలని, సభ స్పీకర్ సొంతం కాదని జగదీశ్ రెడ్డి బదులిచ్చారు. దీంతో నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్దమని స్పీకర్ వెల్లడించారు.

 

స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాలని జగదీశ్ రెడ్డి అన్నారు. సభా సంప్రదాయాలు ఏంటో తేలాకే నేను మాట్లాడుతానని చెప్పారు. అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దళిత స్పీకర్‌ను జగదీశ్ రెడ్డి అవమానించారని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగదీశ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

దళితుడిని సీఎం చేస్తామన్నారు.. చేశారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని చెప్పారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బీఆర్ఎస్ వైఫల్యాలనే మా సభ్యులు చెప్పారన్నారు. పదేళ్లు చేయలేనిది మేము ఏడాదిలోనే చేసి చూపించామన్నారు.

Exit mobile version
Skip to toolbar