Mynampally Hanumantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఇతర అంశాలపై ఆయనతో సీనియర్లు చర్చించనున్నారు. ఇప్పటికే మైనంపల్లి ఇంటికి దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేరుకున్నారు. అంతకు ముందు శ్రీధర్ నివాసంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి..నందికంటి నివాసంలో భేటి అయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం మైనంపల్లి హనుమంతరావు ఇంటికి బయలుదేరారు.
కాంగ్రెస్ లో చేరుతున్నాను..(Mynampally Hanumantha Rao)
త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని,నియోజక వర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు, నా కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఈ నెల 27లోపు పార్టీలో చేరుతానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనంపల్లి. తనకు పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడనని చెప్పారు. ఇలా ఉండగా హనుమంతరావు తనకు మల్కాజిగిరి టిక్కెట్టును, తన కుమారుడు రోహిత్ కు మెదక్ టిక్కెట్టు కావాలని అడిగినట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సిద్దమవుతున్నారు.