Bhadradri Kothagudem district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు . దీనితో పాటు శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు చెల్లించాలని.. రిటైర్‌మెంట్ వయస్సు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లించాలని సీఎం ఆదేశించారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.
అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని కోరారు.
మంగళవారం పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య జరిగిన వివాదంలో దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.