Rain alert to Andhra Pradesh & Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీతో పాటు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ట్రోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులకు వరితో పాటు మామిడి రైతులు ఇబ్బందులు పడ్డారు. మామిడి కాయలు రాలిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే, ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేశారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని రైతులకు జాగ్రత్తలు సూచించారు.