Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు జారీ చేసింది.
అదే విధంగా పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో క్యుమలోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఇదిలా ఉండగా, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. పదర మండలంలోని కూడన్‌పల్లి సమీపంలో పిడుగు పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గ్రామ సమీపంలోని పొలంలో వయవసాయ పనులు చేస్తుండగా.. పిడుగు పడింది. ఈ ధాటికి ఇద్దరు మహిళలు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దాదాపుగా గంటల తరబడి భారీ శబ్ధాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇక, హైదరాబాద్‌లో గత కొంతకాలంగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలను వరుణుడు సంతోషపెట్టాడు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతంలో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా హిమయత్ నగర్, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, అబిడ్స్ ప్రాంతాల్లో 30 నిమిషాలపాటు వర్షం కురిసింది. దీంతో పలు చోట్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.