PM Modi Tour: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయింది. ఏప్రిల్ 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందేభారత్ రైలు ఇది. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల కోసం రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండో వందేభారత్ రైలును సికింద్రాబాద్ టూ తిరుపతి మధ్య నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్గంలో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఉన్న మూడు రైలు మార్గాల్లో వందేభారత్ రైలును ఏ రూట్‌లో నడపాలనే దానిపై అధికారులు అధ్యయనం చేసి ఖరారు చేశారు. ఈ క్రమంలో బీబీనగర్, ఖాజీపేట, విజయవాడ మీదుగా వందేభారత్ నడపడంపై అధ్యయనం చేశారు.
నారాయణాద్రి రూట్ లో?(PM Modi Tour)
ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న మార్గంలోనే ఈ వందేభారత్ రైలును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-బీబీనగర్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి వందేభారత్ నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇదే సమయంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా నడపేలా కూడా అధికారులు సర్వే చేశారు
8 గంటల్లోపే తిరుపతికి
ప్రస్తుతం సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ సమయం దాదాపు 12 గంటల వరకు పడుతోంది. అదే వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోపే ప్రయాణ సమయం ఉండే అవకాశం ఉంది. కాగా, గత జనవరి 15న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించిన సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ రైలు విజయవంతంగా నడుస్తోంది. ఈ రైలు రాకతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 4 గంటల దాకా తగ్గింది.