Medaram: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మేడారంమినీ జాతర నిర్వహించనున్నట్టుగా పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నామని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ది చేయడం, ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవార్ల గద్దెలను శుద్ది చేసిన తర్వాత సమ్మక్క- సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని పూజారులు చెప్పారు. అయితే మినీ మేడారం జాతర సమమయంలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. అయితే గద్దెల వద్ద పూజరులు ప్రత్యేక పూజలు చేస్తారు.
ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరుగాంచిన సంగతి తెలిసిందే. తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు.