Minister Ponguleti Key Statements about Bhu Bharati Telangana Assembly: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ ‘భూభారతి’తీసుకొచ్చింది. ఈ తెలంగాణ భూభారతి బిల్లును ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగానే తాజాగా, భూభారతిపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి విమర్శలు చేశారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని అసెంబ్లీలో పొంగులేటి చెప్పారు. ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లామని వెల్లడించారు. ధరణి బాగుందా లేదా అనేది ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైందన్నారు.
పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేస్తూనే ఉందని, అందుకే ప్రజలు మూడోసారి గెలవకుండా ఓడించి బ్రేక్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభారతిపైనే భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దామని సవాల్ విసిరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినందున వారిని ఓడించారని పొంగులేటి ఆరోపించారు.
అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. భూభారతిపై కాంగ్రెస్ ఎన్నికలు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది భూ భారతి కాదని.. భూహారతి అని ఎద్దేవా చేశారు. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచిందని, ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.