KTR Comments: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీల సమస్య అన్నారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని లోకేష్ ఫోన్ చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలి..(KTR Comments)
ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దన్నారు. జగన్, లోకేష్, పవన్ అందరూ తనకు స్నేహితులేనన్న కేటీఆర్.. శాంతిభద్రతలే తమకు ముఖ్యమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమసమయంలో కూడా ఐటీ కారిడార్ లో ఆందోళనలు నిషేధించారని అన్నారు. అందువలన చంద్రబాబుకు మద్దతు పలికే వారు ఏపీ వెళ్లి నిరసనలను తెలుపుకోవాలని అన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించడంపై కేటీఆర్ మాట్లాడుతూ అది వారి వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
తెలంగాణపై విషం చిమ్మారు..
మరోవైపు ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కొత్త పార్లమెంట్‌లో తొలిరోజే తెలంగాణపై విషం చిమ్మారని ధ్వజమెత్తారు. తెలంగాణపై పగబట్టినట్లు ప్రధాని మాట్లాడారన్నారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను మోదీ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణపై పగబట్టినట్లు మోదీ మాట్లాడుతున్నారు.
తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోదీ అంటున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అని కేటీఆర్ పేర్కొన్నారు.