Vijayawada: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జయహో బీసీ సభ ప్రారంభమైంది. ఈ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు హాజరుకాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మహాసభ జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. వీరిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మెన్లు, డైరెక్టర్లు, పట్టణ స్థాయిలో ఉండే ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొననున్నారు.
మొత్తం 80 వేల మందికి ఆహ్వానాలు పంపింది వైసీపీ పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతారన్నది సీఎం జగన్ ప్రకటిస్తారు.. ఈ సభలో బీసీలకు మరింత రాజ్యాధికారాన్ని కట్టబెట్టేలా నిర్ణయాలు, తీర్మానాలు ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు ఈ జయహో బీసీ సభకు వచ్చే వారి కోసం పసందైన వంటకాలను సిద్ధం చేశారు.ఉదయం ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్ ఐటెంలు ఉండగా, మధ్యాహ్నం భోజనంలో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్య, కోడిగుడ్డు, చాపల పులుసు, పెరుగు, చక్కెర పొంగలి మెనూలో ఉన్నాయి. శాఖాహారుల కోసం పనసకాయ ధమ్ బిర్యానీ, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు, పప్పు టమోటా, గోంగూర పచ్చడి, సాంబార్, పెరుగు, చక్కెర పొంగలి ఉంటుంది.
ఈ సభను విజయవంతం చేయడానికి ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన సీనియర్ బీసీ నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చించారు. దీనిద్వారా రాష్ట్రంలోని బీసీలకు తామే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేయాలని వైసీపీ నిర్ణయించింది.