Kothagudem: తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణించి మూడురోజులే అయింది. ఆ బాధను దిగమింగుతూనే పరుగుపందెంలో సత్తా చాటి తన ప్రతిభ చాటుకుంది ఆ బాలిక. భద్రాద్రి కొత్తగూడెంలో గుత్తికోయల చేతిలో మరణించిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుమార్తె కృతిక అందిరితో శెభాష్ అనిపించుకుంటోంది. తండ్రి మరణం ఓ వైపు… ఆ తండ్రి పంచిన గుర్తులు మరోవైపు.. వెరసి తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాస్థాయి క్రీడల్లో కృతిక సత్తా చాటింది.
కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో 100 మీటర్ల పరుగు పందెం.. అలాగే లాంగ్ జంప్‌లో విజేతగా నిలిచింది. అండర్ -10 విభాగంలో లాంగ్ జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం సాధించింది. డిసెంబరు 5,6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైంది. నాన్నకిచ్చిన మాటను నిలబెట్టుకున్న కృతికను అక్కడున్న వారంతా మెచ్చుకున్నారు.
మరోవైపు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య పట్ల ఓ గిరిజన గ్రామం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస గొత్తి కోయలను వారి రాష్ట్రానికి పంపాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ ప్రజలు.. వలస గొత్తికోయలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సభలో తీర్మానాన్ని.. పంచాయతీ పాలకవర్గం, ప్రజలు ఆమోదించారు. నిజాయితీ గల ఆఫీసర్ రేంజర్ శ్రీనివాసరావును గొత్తికోయలు చంపారని.. బెండాలపాడు గ్రామస్తులపై కూడా గొత్తికోయలు దాడులు చేసేవారని తెలిపారు. బెండాలపాడులో ఉన్న గొత్తికోయలను ఛత్తీస్‌గఢ్‌కు పంపాలని తీర్మానం చేశారు.